Monday, May 18, 2020

పదిహేను రోజుల తరువాత

Kanchi Mahaswami Satabdhi Manimantapam




సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారి కుమారుడు డా. అల్లాడి రామకృష్ణన్ మరియు అతని భార్య శ్రీమతి లలితా రామకృష్ణన్ అమెరికా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వెళ్ళేముందు ఒకసారి పరమాచార్య స్వామిని దర్శించి ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చారు.

”ఎప్పుడు బయలుదేరాలి?”

“ఈ నెల పన్నెండున స్వామి”

స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉండి తరువాత కాసేపు కళ్ళు మూసుకున్నారు.

”పదిహేను రోజుల తరువాత బయలుదేరొచ్చు కదా!” అని అన్నారు.

హఠాత్తుగా వచ్చిన మహాస్వామివారి ఆజ్ఞ.

స్వామివారికి తెలియపరచకుండా పన్నెండో తేదీనే బయలుదేరవచ్చు. ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలంటే కన్ ఫర్మ్ అయిన టికెట్లను రద్దు చేసుకుని మరలా కొత్తగా రిజర్వ్ చేయించుకోవాలి. మహాస్వామివారు గుర్తుపెట్టుకుని మరీ ఏమి అడగరు కదా!!

కాని మహాస్వామివారు అలా చెప్పిన తరువాత అతనిక వెళ్ళడు. కనుక ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.

పన్నెండో తేదీన మీనంబాక్కం విమానాశ్రయం నుండి అమెరికాకు వెళ్ళాల్సిన విమానం తన ప్రయాణాన్ని దురదృష్టవశాత్తు ముంబైలోనే ముగించింది.

తరువాత ఆ విమానంలో ఉన్న వందమందీ ఆరోజే మృత్యువాత పడ్డారని తెలిసింది.

రామకృష్ణన్ దంపతులకి రెండు రకాలుగా కన్నీళ్ళు వచ్చాయి. అంతమంది చనిపోయినందుకు బాధతో, వారిని కాపాడినందుకు కృతజ్ఞతతో.

--- వి. శ్రీనివాసన్, చెన్నై. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 2

Credit 👇

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం