Thursday, November 17, 2016

ఉజ్జైన్యాం మహాకాళం





(ఉజ్జయిని మహాకాళేశ్వరుడు)


అందరికీ నమస్కారం.

ఈ రోజు మూడవ జ్యోతిర్లింగమైన మహాకాళేశ్వరుడి గురించి తెలుసుకుందాం. ఉజ్జయినిలో ఉన్న ఈ క్షేత్రం కూడా శ్రీశైలంలాగే శక్తిపీఠంతో కూడిన జ్యోతిర్లింగ క్షేత్రం, అందుచేత మహా విశేషమైనటువంటిది. ఉజ్జయిని నగరం యుగపురుషుడైన విక్రమార్కచక్రవర్తి రాజధాని.  విక్రమార్కుడి ఆస్థానంలోనివాడూ ఆయనకు ఆప్తమితృడూ ఐన కాళిదాసుని కరుణించి కటాక్షించిన కాళికా అమ్మవారు ఈ క్షేత్రంలోని అమ్మవారే. కాళికా వరప్రసాది కనుకనే 'కాళి 'దాసు ఐనాడు. ఇక స్థలపురాణంలోకెళితే పూర్వం ఉజ్జయినికి దగ్గరలో 'రత్నమాలా' అనే పర్వతం ఉండేది దానిపై 'దూషణుడు' అనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మ ఇచ్చిన వరముచే గర్వితుడై బుధజనపీడాపరుడై, లోకకంటకుడై ప్రవర్తించేవాడు. అదే కాలంలో ఉజ్జయినిలో 'వేదప్రియుడు' అనే బ్రాహ్మణుడు ఉండేవాడు.  ఆయన యఙ్ఞయాగాది కర్మలను ఆచరించేవాడు, విశేషించి శివభక్తుడు. ఆయనకు నలుగురు కుమారులు. వేదప్రియుడు ఆయన నలుగురు కుమారులూ పరమశివభక్తులు. దూషణుడు అతని రాక్షస పరివారం ఉజ్జయిని మీద ఒకసారి విరుచుకుపడ్డారు. ప్రజలను భయభ్రాంతులని చేస్తూ ఇల్లు ఇల్లూ నాశనం చేయసాగారు. యఙ్ఞ యాగాది క్రతువులను నాశనం చేయసాగారు. వేదప్రియుడి ఇంట్లో వేదప్రియుడు తన నలుగురుకుమారులతో పార్ధివ శివలింగానికి పూజ చేస్తున్నాడు. రాక్షసుడు పెద్దగా అరుస్తూ ఇంటప్రవేశించి నాశనం చేస్తున్నా పూర్తి ఏకాగ్ర చిత్తంతో వారు పూజలోనే నిమగ్నమై ఉన్నారు. దూషణుడు వేదప్రియుడిని చంపబోయాడు. ఈ చర్య పార్ధివలింగమూర్తి ఐన పరమేశ్వరుడికి తీవ్ర కోపం తెప్పించింది. ఆయన క్షణంలో ప్రళయరుద్రుడయ్యాడు. లింగం నుంచీ ఒక్క హుంకారం చేశాడు ఆ వేడి నిష్వాశకు రాక్షసుడితో సహా రాక్షససేన మొత్తం మరణించారు. ఆ మహారౌద్రమూర్తి వేదప్రియుడి అచంచల భక్తికీ, అతని కుమారుల భక్తికీ ప్రసన్నుడై ఏదైనా వరంకోరుకోమన్నాడు. అందుకు వెదప్రియుడు తనని కాచిన స్వామి లోకులందరినీ కటాక్షిస్తూ అక్కడే ఉండమని కోరుకోగా స్వామి వెలిసారని స్థలపురాణం.

ఇక తాత్వికంగా స్థలపురాణాన్ని పరిశీలిస్తే..

కేవలం ఉజ్జయిని మహాకాళేశ్వరుడినీ అన్న దృష్టితో కన్నా నిన్న మొన్నటి సోమనాధ శ్రీశైల క్షేత్రాల పరంపరలోఅందుకు కొనసాగింపుగా కధని పరిశీలిస్తే చక్కగా అన్వయమౌతుంది.  మనస్సు, దాని స్వభావం, నిగ్రహం అన్నిటా సమభావం అలవరచుకోడం ఆధ్యాత్మిక సాధనలో తొలి అడుగైతే. ఆ మనస్సులో భక్తిని పెంచి భక్తితత్వంలో పరాకాష్టకు చేరుకోడం రెండవ మెట్టు. ఇహ అలా సాధన సాగుతుంటే ఈ రోజు స్థలపురాణం తాత్వికంగా సందర్భోచితంగా ఉంటుంది. రాక్షసుడి పేరు 'దూషణుడు ' అంటే దూషణ భావం అన్నమాట. రాక్షససేనంతా తదనుబందమైన ఈర్ష్యాది చెడుభావనలే. మనస్సునిండా భక్తి వెల్లివిసిరిన సాధకుడి చేష్టితాలన్నీ 'వేదప్రియం'గానే ఉంటాయి. ఇక్కడ వేదప్రియుడు నిత్యం యఙ్ఞాదిక్రతువులను ఆచరించడం అంటే వేదోక్త కర్మలను ఆచరించడమే. వేదప్రియుడి కుమారులంటే భక్తి ఫలితంగా కలిగే ఇతర ఫలాలు. ఙ్ఞాన, వైరాగ్యాలు తదితరమైనవి. ఆ ఫలాలు వేదప్రియుడికి కుమారులు శివపూజలో తోడైనట్టు సాధకుడికి ఆధ్యాత్మిక పురోగతిలో ఉపకరిస్తాయి. అటువంటి భక్తుడికి అవరోధంగా ఏ 'దూషణుడు' అడ్డు తగిలినా ఆ పరమాత్మే ఆ అవరోధాలన్నిటినీ తొలగించి రక్షిస్తాడన్న సందేశం మనకు భరోసానిస్తుంది. సాధకుడికి ఈ భరోసా ముఖ్యం. కారణం మనస్సుకు సంశయం ఒక సహజమైన బలహీనత.  అది సహజంగా సంశయాత్మకమైన మనస్సులో అపనమ్మకాలను మాయంచేసి భక్తిని మరింత దృఢభక్తిగా చేస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా మరేం పర్లేదు నేనే నీకు మోక్షం కూడా ఇస్తా అంటూ "సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణంవ్రజ అహం త్వం సర్వపాపేభ్యో మోక్షయైష్యామి మా సుచ:" అని భరోసా ఇచ్చాడు.


ఓం నమశ్శివాయ