Wednesday, July 24, 2019

అయ్యంగార్ స్వామి అలక


Related image
ప్రతి శుక్రవారం కంచి మఠంలో విద్వత్ సదస్సు జరుగుతుంది. పండితులందరూ వివిధ విషయలపైన చర్చించుకుంటారు. చివరికి పరమాచార్య స్వామివారు చివరిగా వివరణ ఇస్తారు. అలాగే పండితులందరికి స్వామివారు సన్మానం అంటే దక్షిణ ఇస్తారు.

అలాంటి ఒకరోజున చిన్నకాంచీపురం నుండి ఒక అయ్యంగారు పండితులు వచ్చారు. పరమాచార్య స్వామికి నమస్కారములు చేసి స్వామివారు ఇచ్చిన డబ్బులను తీసుకున్నారు. కాని దానితో అతను తృప్తి చెందలేదని అతని హావభావాలు చెబుతున్నాయి. మహాస్వామి వారు దాన్ని గమనించి, “ఏమి అయ్యంగార్ స్వామివారు సంతోషమే కదా?” అని అడిగారు. ఆయన అవును అని ముభావంగా చెప్పి వెళ్ళిపోయారు.

మిగిలిన పండితుల తరువాత సామాన్య భక్తులు స్వామి దర్శనానికి వచ్చారు. మొదట ఉన్నది కుటుంబంతో సహా ఉన్న ఒక న్యాయవాది. ఆయన ఒక పళ్ళెంలో పళ్ళు, పూలు, జీడిపప్పు మొదలైనవి తీసుకుని వచ్చి స్వామివారి ముందు పెట్టి “పెరియవ ఒక విన్నపం” అని అన్నాడు.

మహాస్వామివారు అతణ్ణి ఊరకే ఉండమని చెప్పి, ఒక శిష్యుణ్ణి పిలిచి “వెళ్ళి ఆ అయ్యంగార్ స్వామిని పిలుచుకుని రా. చిన్న కాంచీపురం వెళ్ళడానికి బస్సులో కూర్చుని ఉంటాడు” అని చెప్పారు. ఆ శిష్యుడు గంగై కొండన్ బస్టాండుకు వెళ్ళి చూడగా ఒక బస్సులో కూర్చుని కనిపించారు. మహాస్వామివారు తనను రమ్మన్నారని ఆ అయ్యంగార్ స్వామితో చెప్పాడు ఆ శిష్యుడు.

”నేను ముప్పై పైసలు పెట్టి టికెట్టు కొన్నాను. నేను ఇప్పుడు అక్కడికి వస్తే నాకు ముప్పై పైసలు నష్టం” అని చెప్పాడు ఆ స్వామి. దీన్నంతా గమనిస్తున్న బస్ కండక్టరు వెంటనే, “ఏంటి స్వామి, పరమాచార్య దర్శనం కోసం దేశవిదేశాల నుండి వస్తారు. మీరు చూస్తే స్వామివారే రమ్మంటుంటే వెళ్ళనంటున్నారు. ఆ టికెట్టు ఇలా ఇవ్వండి మీ ముప్పై పైసలు మీకు తిరిగిస్తాను. ఏదో ముఖ్యమైన విషయమేమో, వెళ్ళి స్వామివారి కలవండి” అని చెప్పాడు.

ఆ అయ్యంగార్ స్వామి టికెట్టు వెనక్కిచ్చి, ముప్పై పైసలు తీసుకుని బస్సు దిగి ఆ శిష్యుడితో పాటు వెళ్ళాడు స్వామివారిని చూడటానికి. మహాస్వామివారు నవ్వుతూ, “ఏమి అయ్యంగార్ స్వామివారు! మీ ముప్పై పైసలు త్రిగివ్వకపోతే బస్సు దిగి ఇక్కడికి రారా ఏమి?” ఇది విని అతను నోరెళ్ళబెట్టాడు. స్వామివారికి ఎలా తెలుసు ఆ విషయం?

పక్కనున్న న్యాయవాది మళ్ళీ మొదలెట్టాడు, “పెరియవ ఒక విన్నపం . . ”

మహాస్వామివారు ఉండు అని చెప్పి అయ్యంగార్ స్వామిని న్యాయవాది పక్కన కూర్చోమన్నారు. ఆ స్వామి చిరునామా తీసుకోవలసిందిగా ఆ న్యాయవాదికి చెప్పారు. తరువాత ఆయ్యంగార్ స్వామితో, “తరువాతి బస్సు సిద్ధంగా ఉంది వెళ్ళమని చెప్పారు”

అతనికి ఏమి అర్థం కాక వెళ్ళిపోయాడు.

న్యాయవాది మరలా, “పెరియవా. . .” అని మొదలు పెడుతుండగా స్వామివారే “ఏమప్పా! ప్రతి నెలా వేదం చదివిన ఒక పేద బ్రాహ్మణుడికి కొంత ధనం ఇవ్వాలి అని కదా అనుకుటున్నావు. అంతేనా?” అని అడిగారు. అతను కొద్దిసేపు చేష్టలుడిగి తరువాత తేరుకుని, “అవును పెరియవ” అని బదులిచ్చాడు.

“నీకు తెలుసా, నేను ఆ అయ్యంగార్ స్వామి చిరునామా తీసుకోమన్నది అందుకే. ప్రతి నెలా మరువకుండా రూ.250/- పంపు. నువ్వు కొద్ది నెలల తరువాత నిలిపివేస్తే అతను మరలా ఇక్కడకు వస్తాడు. అతను చాలా మంచివాడు, పండితుడు. కాని పేదవాడు అంతే” అని చెప్పారు.

న్యాయవాది అందుకు ఒప్పుకుని, కుటుంబ సమేతంగా స్వామివారికి సాష్టాంగం చేసి వెళ్ళిపోయారు. ఆ అయ్యంగార్ కి స్వామి ప్రతినెలా డబ్బు అందుతోందా లేదా అని తమ శిష్యుల ద్వారా కొన్ని నెలల పాటు విచారణ చేశారు స్వామివారు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం