Saturday, July 13, 2019

మృష్టాన్నభోజనం


ఈరోజుల్లో టీవీలలో ఎన్నో వంటల కార్యక్రమాలు వస్తున్నాయి. ఆ కార్యక్రమాల్లో ఇచ్చే సూచనలను  సరిగ్గా అర్థం చేసుకుని వండితే, చివరగా తయారయ్యే పదార్ధం తినడానికి యోగ్యంగా ఉంటుందా? అది అనుమానమే.

కొత్త వంటకాలు ఏవీ లేకపోతె, సాధారణంగా చేసే మునక్కాయ సాంబారు లేదా బెండకాయ తాలింపు చేసే విధానాన్నే ఉపయోగించి కొత్త వంటలు చేస్తారు.

స్వామివారు పూర్వాశ్రమంలో ఎన్నడూ వంటింటికి వెళ్ళలేదు; సన్యసించిన తరువాత ఇక వెళ్ళాల్సిన అవసరం లేదు. కాని స్వామివారికి నలభీమపాకంలోని మెళకువలన్నీ తెలుసు. అంతేకాక కొత్త కొత్త వంటలు ఎలా చెయ్యాలో కూడా మంచి నేర్పు.

మేము పండరీపురం నుండి తిరిగొస్తున్నాము. అయిదారు చిన్ని గుడిసెలు ఉన్న ఒక కుగ్రామానికి చేరుకున్నాము. ఒక పెద్ద చెట్టు కింద మకాం ఏర్పాటుచేసుకున్నాము.

పరమాచార్య స్వామివారు భిక్ష పూర్తిచెయ్యగానే, మాకోసం కాస్త ఎక్కువగా వండిన పదార్థాలను ఆరగించి మా భోజనం కూడా పూర్తిచేశాము. అది మధ్యాహ్న విశ్రాంతి సమయం.

హఠాత్తుగా పెద్ద కోలాహలంతో ఇరవై మంది వ్యక్తులు వచ్చారు. వారందరూ చెన్నై ప్రాంతం వారు. శ్రీమఠం మకాం కాబట్టి శ్రీ చంద్రమౌళీశ్వర ప్రసాదంగా మంచి ఆహారం దొరుకుతునదన్న నమ్మకంతో అక్కడకు వచ్చారు.

కాని అప్పుడు శ్రీమఠం ఒక పెద్ద చెట్టు కింద మకాం చేసి ఉంది. వండడానికి కావాల్సిన సరుకులు, పాత్రలు కూడా లేవు. ఇటువంటి విషయాల గురించి మహాస్వామివారు ఎక్కువగా కలతచెందేవారు కాదు. ఆకలితో వచ్చిన వారి కడుపు నింపడమే స్వామివారి లక్ష్యం.

బ్రహ్మచారి రామకృష్ణన్ అని స్వామివారి ఆంతరంగిక సేవకుడు ఉండేవాడు. “అందరికి ఆహారం తయారుచెయ్యి” అని అతణ్ణి ఆదేశించారు స్వామివారు.
రామకృష్ణన్ చేతులు నలుపుతూ నిస్సహాయంగా నిలబడి, “మనం మన మకాం తరువాతి ఊరికి వెళ్ళినతరువాత వారికి వండి పెడతాను” అని తెలిపాడు.
ఇబ్బంది ఉందని పరమాచార్య స్వామివారు అర్థం చేసుకుని, “బియ్యం ఉందా?” అని అడిగారు.

“ఉంది; కాస్త పెసర పప్పు కూడా ఉంది”

“అయితే ఇంకేం! నువ్వు ఏం చేస్తావంటే, బియ్యాన్ని నానబెట్టి కడుగు, ఆ నీటిని మరొక పాత్రలో సేకరించు. డానికి కొద్దిగా ఉప్పు వేసి, నిమ్మకాయ పిండి, నారత్తై ఆకులను కత్తిరించి వెయ్యి. ఇది మజ్జిగ అవుతుంది.

పెసర పప్పుని ఎక్కువగా నీరు పోసి ఉడికించు. నీటిని పప్పును వేరుచేసి, ఆ వేడినీళ్ళకు నిమ్మకాయ వెయ్యి. ఇది రసం అవుతుంది.

ఇప్పుడు ఉడికించిన పెసర పప్పు ఉంది కదా! దానికి కాస్త ఉప్పు, కత్తిరించిన మిరపకాయలు వెయ్యి. అది తాళింపు అవుతుంది” అని ఆదేశించారు.

అరగంటలో మొత్తం సిద్ధం అయ్యింది. ఈలోగా మేము అతిథులకి భోజనానికి ఆకులు, నీరు సమకూర్చాము. మొత్తానికి షడ్రుచుల నాలుక కోసం అన్నం, పెసర పప్పు తాళింపు, రసం, మజ్జిగ తయారుచేసాము.

“ఇది మృష్టాన్న భోజనం” అన్నారొక అతిథి.

“దేవామృతం” అని మరొకరు చెప్పారు.

“ఇంతటి రుచికరమైన భోజనాన్ని ఇంతకుముందెన్నడూ తినలేదు” అన్నారు మూడవవారు.

ఆ మాటలను విని మాలో మేము నవ్వుకున్నాము. అది పరమాచార్య స్వామివారి వాక్కు వల్ల కలిగిన రుచి అని మాకు తెలుసు.

ఆతిథ్యం అన్నది పరమాచార్య స్వామివారిని చూసే నేర్చుకోవాలి. అది ఒక అక్షయ పాత్ర.

--- శ్రీమఠం బాలు. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 4

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం