Saturday, June 8, 2019

మార్కండేయ మహాముని


 Related image
పుణ్యపురుషుల సందర్శనం, పవిత్ర ప్రదేశాల ప్రభావం సామాన్యమైనవి కావని అర్ధాయుష్కులను కూడా చిరాయుష్కులుగా చేయగల శక్తి తీర్థక్షేత్ర సందర్శనం వలన కలుగుతుందని వివరించే కథ పద్మపురాణం 33వ అధ్యాయంలో కనిపిస్తుంది. మార్కండేయ ముని జీవితానికి సబంధించిన ఈ కథను పులస్త్యముని భీష్ముడికి వివరించి చెప్పాడు. పూర్వం మ్రుకండుడు అనే ముని తన భార్యతో సహా కఠోరంగా తపస్సు చేసి దైవానుగ్రహం వలన ఒక కుమారుడిని పొందాడు. ఆ బాలుడు ఐదేళ్ల ప్రాయంలోనే మంచి గుణగణాలతో ప్రకాశిస్తూ ఉండేవాడు. ఆ చిన్నారి బాలుడు ఇంటి ముంగిట తిరుగుతూ వచ్చేపోయే వారందరికీ జరగబోయే విషయాలను ఎన్నింటినో వివరిస్తూ ఉండేవాడు. దీనిని గమనించిన మ్రుకండుడు ఒకరోజున తన కుమారుడిని పిలిచి నీ ఆయుర్ధాయం ఎంతో చెప్పగలవా అని అడిగాడు.

                                                             ఆ బాలుడు తనకు బ్రహ్మ ఇచ్చిన ఆయువు ఇంకా ఆరు మాసములే ఉందని చెప్పాడు. ఆ మాటలను విని దుఃఖిస్తున్న తండ్రిని దుఃఖించవడద్దని ఆ బాలుడు చెప్పాడు. వెంటనే మ్రుకండుడు తన కుమారుడికి ఉపనయనం జరిపించి, హితబోధగా కనిపించిన ప్రతిమనిషికి ఎటువంటి బేధాన్ని తలచకుండా నమస్కరిస్తూ ఉండమని చెప్పాడు. ఆ బాలుడు తండ్రి మాటను శిరసావహించి తనకు కనిపించిన ప్రతి మనిషికి ఎంతో భక్తిభావంతో, వినయంతో నమస్కరిస్తూ ఉండేవాడు. ఇలా కాలం గడుస్తుండగా ఒకరోజున సప్తరుషులు తీర్థయాత్రలకు వెళుతూ ఆ బాలుడి కంట పడ్డారు. తనకు ఎదురైన ఆ సప్తర్షులందరికీ ఎంతో భక్తితో నమస్కరించాడు. ఆ చిన్నారి బాలుడు అలా నమస్కరించడం ఎంతో ముచ్చటగా సప్తర్షులకు అనిపించింది. వెంటనే వారు ‘‘పూర్ణాయుష్కుడవు కమ్ము’’ అని దీవించారు. అయితే ఆ వెంటనే వారు ఆ బాలుడికి బ్రహ్మ అల్పాయువునే ప్రసాదించాడని తెలుసుకున్నారు. అంతేగాక ఇంకా ఐదు రోజులు మాత్రమే అతనికి ఆయువు ఉందని గ్రహించారు. వెనువెంటనే ఆలస్యం చేయక ఆ బాలుడిని కూడా వెంటబెట్టుకొని వారంతా బ్రహ్మ దగ్గరకు వెళ్ళి నమస్కరించారు. ఆ రుషుల నడుమ బాలుడే ముందుగా తనను గుర్తించి నమస్కరించడం బ్రహ్మకు కూడా ఎంతో ఆనందాన్ని కలిగించింది. వెంటనే బ్రహ్మదేవుడు చిరాయువు కమ్మని ఆ బాలుడిని ఆశీర్వదించాడు. బ్రహ్మ ఆశీర్వచనం విని ప్రక్కనే ఉన్న రుషులంతా ఎంతో ఆనందించారు. ఆ రుషులంతా అలా ఎందుకు ఒక్కసారిగా ఆనందస్వరూపులవుతున్నారో బ్రహ్మకు తెలియరాక ఆ బాలుడు ఎవరని, రుషులంతా తనదగ్గరకు రావడానికి కారణమేమిటని రుషులను ప్రశ్నించాడు బ్రహ్మ. అప్పుడు సప్తర్షులు ఆ బాలుడు మ్రుకండుడి కుమారుడని జరిగిన విషయమంతా వివరించి ఆ బాలుడు తన తండ్రి ఆజ్ఞానుసారం కనిపించిన ప్రతిమనిషికి భక్తి, వినయాలతో నమస్కరిస్తూ తీర్థయాత్రలు చేస్తున్న తమకు ఎదురయ్యాడని చెప్పారు. తాము కూడా ఆ బాలుడిని దీర్ఘాయువుగా ఉండమని దీవించినట్లు ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఆ బాలుడిని చిరాయువు ప్రసాదంచడం ఎంతో ఆనందాన్ని కలిగించినట్లు వారు చెప్పారు. ఆ మాటలను విని బ్రహ్మదేవుడు కూడా ఎంతో ఆనందించి ఆ మార్కండేయుడు (మ్రుకండముని కుమారుడు) తన ఆయువుతో సమానమైన ఆయువు కలిగినవాడవుతాడని మరోమారు పలికి రుషులకు, మార్కడేయునికి వీడ్కోలు పలికాడు. అనంతరం మార్కండేయుడు తన ఇంటికి, రుషులు తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళారు. మార్కండేయుడు ఇంటికి తిరిగివచ్చి తన తండ్రితో జరిగిన విషయాన్నంతటినీ వివరించి తన జీవితమంతా బ్రహ్మను గురించిన తపస్సులోనే గడిచేలా అనుమతి ఇవ్వమని వేడుకున్నాడు. తన కుమారుడి విజయానికి మ్రుకండుడు ఎంతగానో ఆనందించినప్పటికీ వెంటనే తనను వీడి వెళుతున్నందుకు కొంత బాధాతప్తుడయ్యాడు. అప్పుడు మార్కండేయుడు తండ్రికి ధైర్యం చెప్పి దుఃఖించవలసిన పనిలేదని తాను పుష్కరతీర్థంలో తపస్సు నిర్వహించడానికి వెళుతున్నానని ఆ పుష్కరతీర్థ మహిమను సాక్షాత్తూ జగన్నాథుడే
‘‘బ్రహ్మలోకస్య పన్థానం ధన్యాఃపశ్యంతి పుష్కరం! యన్తు వర్షశతం సాగ్రమగ్నిహోత్రముపాసితా!! కార్తీకం వసేదేకాం పుష్కరే సమమేవచ! కర్తుమ్మయా నశక్తిః కర్మణానైవ సాధితమే!!’’
ఇలా అభివర్ణించాడని చెప్పాడు. ఈ కథలో అల్పాయుష్కుడైన బాలుడు తీర్థయాత్రలు చేస్తున్న సప్తర్షులకు కనిపించడం వారివెంటనే తానే బయలుదేరి బ్రహ్మలోకం వరకూ వెళ్ళి బ్రహ్మ ఆశీస్సులను కూడా పొందటం లాంటి సందర్భాలను పరిశీలిస్తే సత్పురుషుల సందర్శనం, తీర్థయాత్రల వలన కలిగే పుణ్యఫలితం ఎంతటి సత్ఫలితాలను ఇస్తాయో గమనించవచ్చు.


- శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు
- సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ

No comments:

Post a Comment