Wednesday, July 10, 2019

మంగళసూత్రం - సుమంగళి


Image result for sri chandrasekharendra saraswathi mahaswamy

పాలక్కాడ్ జిల్లాలోని మంజపర బ్రాహ్మణ సమూహానికి చెందిన ఆర్.జి. వెంకటాచలం కంచి మఠానికి పెద్ద భక్తుడు. చాలా పెద్ద పెద్ద పదవులనలంకరించి ఇప్పుడు చెన్నైలో జీవిస్తున్నారు. కాని తమ జన్మస్థలం అంటే వల్లమాలిన అభిమానం. దాదాపు యాభైలక్షల రూపాయలు విరాళాలు సేకరించి మంజపరలోని గురువాయురప్పన్ దేవస్థానాన్ని పునరుద్ధరింంచారు. వారికి పరమాచార్య స్వామివారితో అనుభవాలు కోకొల్లలు. భక్తిపారవశ్యంతో వారు ఎప్పుడూ ఈ సంఘటనను గుర్తు చేసుకుంటారు.

ప్రతి సంవత్సరమూ వారు పరమాచార్య స్వామివారి అనుగ్రహం కోసం వచ్చేవారు భిక్షావందనంతో. 1988లో రహదారుల ప్రయాణానికి కొంచం ఆటంకం ఏర్పడడంతో ఆయన రావాల్సిన రోజుకు రారు అని అందరూ తలచారు. కాని ఏలాగో వారు కాంచీపురం చేరుకున్నారు. స్వామివారి దర్శన సమయంలో అతణ్ణి, “నీ సంపాదన ఎంత?” అని అడిగారు. వారు సమాధానం చెప్పగానే వారికి స్వామివారి ఆదేశం అందింది.

”నువ్వు ఇక ఎప్పుడు భిక్షావందనం చెయ్యడానికి వచ్చినా, కొన్ని మంగళసూత్రాలను చెయ్యించి నీతోపాటు తీసుకుని రా” అని చెప్పారు.

ఆయన కొద్దిగా అలోచనలో పడ్డారు. ఏ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళసూత్రాలను చెయ్యించాలి. స్మార్త, తెలుగు, అయ్యర్ ఇలా చాలా చాలా ఉన్నాయి కదా. ఏ రకంగా తయారు చేయించాలి? ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది అని.

వెంటనే స్వామివారు “ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏ సంప్రదాయమైనా పరవాలేదు. తీసుకుని రా” అని చెప్పారు. వెంకటాచలం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అతను ఈ విషయమై తన మనసులో ఆలోచిస్తున్నాడు. స్వామివారిని అడగనేలేదు. మరి స్వామివారికి ఎలా తెలిసిసింది? అడగకముందే స్వామివారు సమాధానం ఇవ్వడం అతణ్ణి ఆశ్చర్యచకితుణ్ణి చేసింది.

ఈ సంఘటన జరిగి మూడు సంవత్సరాలు గడిచిపోయింది. ప్రతి సంవత్సరం లాగే ఆ సంవత్సరం కూడా భిక్షావందనానికి శ్రీమఠానికి వచ్చారు. ఆరోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కొద్ది దూరంలో నిలబడి వెంకటాచలం తనవంతు కోసం ఎదురుచూస్తున్నాడు. ఒక పెద్ద ముత్తైదువ బహుశా పేదరాలు, స్వామివారితో ప్రాధేయపూర్వకంగా మాట్లాడుతోంది. స్వామివారి ముఖమండలంలో అనంతమైన శాంతి గోచరిస్తోంది.

వెంకటాచలం తనవంతు రాగానే మహాస్వామి వారిముందు నిలబడి, “స్వామివారి ఆదేశం ప్రకారం మంగళసూత్రాలను తెచ్చాను” అని చెప్పాడు. స్వామివారు చేతివేళ్ల శబ్ధంతో ఆ సుమంగళిని దగ్గరకు రమ్మన్నారు. వెంకటాచలం వైపుకి తిరిగి “ఆమె కుమార్తెకి పెళ్ళి అట. మంగళసూత్రం కావాలి అట. తీసుకో ఇక్కడే నీ చేతులతోనే ఆమెకి ఇవ్వు” అని ఆదేశించారు. వెంకటాచలం చాలా సంతోషించారు.

“సార్, నేను చాలా పోగొట్టుకున్నాను. జీవనం సాగించడానికి కూడా కష్టపడ్డాను. అయినాకూడా, ఎప్పుడూ తిరుమాంగల్యాలు చెయ్యించడం మానలేదు. అది పరమాచార్య స్వామి వారి ఆజ్ఞ కదా? మరి ఎలా వదిలిపెట్టగలను? స్వామివారి ఏమి తెలియదా? అంతా తెలుసు. నా భార్య ఏ బాధాలేకుండా సుమంగళీగానే కన్ను మూసింది. మరి ఇంతకంటె ఇక ఏమి అడగాలి ఆ సర్వేశ్వరుణ్ణి?” అని కంఠం గాద్గదికమవుతుండగా వారి అనుభవాన్ని చెప్పుకొచ్చారు వెంకటాచలం.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

No comments:

Post a Comment